Pranab Mukherjee: నేనైతే తెలంగాణ ఏర్పాటును అంగీకరించేవాడిని కాదు: ఆత్మకథలో ప్రణబ్
- నా చేతుల మీదుగానే విభజన జరుగుతుందని ఊహించలేదు
- పార్టీని నడిపించడంలో సోనియా విఫలమయ్యారు
- నేను రాష్ట్రపతి అయిన తర్వాత అధిష్ఠానంలో మార్పు
- తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది
తన ఆత్మకథ ‘మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్: 2012-2017’ పేరుతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం మార్కెట్లో విడుదలైంది. ఇప్పటికే ఈ పుస్తకంలోని పలు విషయాలు బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. తాజాగా, తెలంగాణ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం మరోమారు సంచలనమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. అలాంటి తన చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందని ఊహించలేకపోయానని ఆ పుస్తకంలో ప్రణబ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత దారుణంగా తయారైందని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ప్రతికూల వాతావరణం ఏర్పడి మరింత క్షీణించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అత్యంత బలమైన రాష్ట్రమని, గతంలో అక్కడ కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు లభించాయని గుర్తు చేశారు. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం వల్లే అధికారానికి దూరమైందన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని తాను భావించానని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. బీజేపీకి గరిష్ఠంగా 200 స్థానాలు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని భావించానని రాసుకొచ్చారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడిందన్నారు. పార్టీని నడిపించడంలో సోనియాగాంధీ వైఫల్యమే ఆ పరిస్థితులకు కారణమన్న ప్రణబ్.. తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చిందన్నారు.