Donald Trump: ఫలితాలపై ఇప్పటికీ సంతృప్తి లేదు... కానీ, నిబంధనల ప్రకారం బైడెన్ కు అధికారం అప్పగిస్తున్నా: ట్రంప్
- అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారు
- ఈ నెల 20న అధికార మార్పిడి
- సంపూర్ణ సహకారం అందిస్తానన్న ట్రంప్
- ఫలితాలపై పోరాటం మాత్రం ఆగదని స్పష్టీకరణ
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికా పార్లమెంటు నిర్ధారించిన నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు సంతృప్తికరంగా లేనప్పటికీ, నిబంధనలు పాటిస్తూ అధికారాన్ని జో బైడెన్ కు అప్పగిస్తున్నానని స్పష్టం చేశారు.
జనవరి 20న జరిగే అధికార మార్పిడికి సంపూర్ణ సహకారం అందిస్తానని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలపై తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అమెరికా తన గత వైభవాన్ని పొందేందుకు చేసే పోరాటంలో ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా ఎన్నికల్లో తన ఓటమిని ఆయన అంగీకరించినట్టయింది. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు పోటీ చేసేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.