Dry Run: రేపు దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్
- త్వరలో దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ
- ఇప్పటికే ఓసారి డ్రై రన్ నిర్వహణ
- రేపు 736 జిల్లాల్లో డ్రై రన్
- రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో కేంద్రం సమీక్ష
- రెండో విడత డ్రై రన్ పై సూచనలు
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహకంగా డ్రై రన్ ప్రక్రియ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలివిడతగా 5 రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టారు. తాజాగా రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెండో విడత డ్రై రన్ నిర్వహించనున్నారు. దేశంలోని 736 జిల్లాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు.
వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే లోటుపాట్లను గుర్తించేందుకు డ్రై రన్ చేపడుతున్నట్టు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకురాదలిచిన కొవిన్ యాప్ గురించి రాష్ట్రాల ఆరోగ్యమంత్రులకు వివరించారు. కరోనా వ్యాక్సిన్ సరఫరాలో కీలకంగా భావించే కోల్డ్ చైన్ రవాణా విధానాన్ని మరింత పటిష్టం చేసినట్టు తెలిపారు. గతంలో పోలియో, రూబెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా అంతే సమర్థతతో నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలు మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సూచించారు. తొలి డ్రై రన్ లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని స్పష్టం చేశారు.