Rishabh Pant: చెత్త కీపింగ్ తో విమర్శల పాలవుతున్న పంత్.. సూచనలు చేసిన ఆసీస్ దిగ్గజం

Ponting point out Rishabh Pant wicket keeping
  • మూడో టెస్టు తొలి రోజు ఆటలో రెండు క్యాచ్ లు వదిలిన పంత్
  • పుకోవ్ స్కీకి రెండు లైఫ్ లు
  • పంత్ మరింత ప్రాక్టీసు చేయాలన్న పాంటింగ్
  • నైపుణ్యం పెంచుకోవాలని సూచన
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ల వెనుక తరచుగా విఫలమవుతూ విమర్శకులకు పని కల్పిస్తున్నాడు. ఇవాళ ఆసీస్ తో మూడో టెస్టు సందర్భంగా తొలిరోజు ఆటలోనూ పంత్ పేలవ వికెట్ కీపింగ్ ప్రదర్శన కనబర్చాడు. రెండు క్యాచ్ లు జారవిడిచి టీమిండియా శిబిరంలో అసంతృప్తి కలిగించాడు. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ యువ ఓపెనర్ విల్ పుకోవ్ స్కీ ఇచ్చిన రెండు క్యాచ్ లను పట్టుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. పంత్ నాసిరకం వికెట్ కీపింగ్ పై ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.

ఆ రెండు క్యాచ్ లను పంత్ పట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. పుకోవ్ స్కీ మరింత భారీ స్కోరు సాధించలేదు కాబట్టి సరిపోయిందని, లేకపోతే పంత్ క్యాచ్ లు వదిలినందుకు టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇతర కీపర్లు వదిలిన క్యాచ్ ల కంటే పంత్ వదిలిన క్యాచ్ లే ఎక్కువని పాంటింగ్ తెలిపాడు.  తన కీపింగ్ నైపుణ్యం పెంచుకునేందుకు పంత్ నెట్ ప్రాక్టీసులో మరింతగా శ్రమించాలని సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
Rishabh Pant
Wicket Keeping
Ricky Ponting
Team India
Australia

More Telugu News