IPL: ఎవరైనా ఆటగాళ్లు వద్దనుకుంటే 21లోగా చెప్పేయండి: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదేశాలు!
- ఎనిమిది ఫ్రాంచైజీలకు అందిన సమాచారం
- ఫిబ్రవరి 6తో ముగియనున్న ట్రేడింగ్ విండో
- రెండో వారం తరువాత ఆటగాళ్ల వేలం
గత సీజన్ లో తమ తమ ఫ్రాంచైజీల తరఫున కొనసాగిన ఆటగాళ్లలో ఎవరినైనా తొలగించాలని భావిస్తే, యాజమాన్యాలు ఈ నెల 21 లోగా జాబితాను పంపించాలని ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీల యాజమాన్యాలకూ సమాచారాన్ని పంపించామని తెలిపారు.
తాజాగా ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరుగగా, నిబంధనల ప్రకారం ట్రేడింగ్ విండో గడువు ఫిబ్రవరి 8తో ముగుస్తుందని గుర్తు చేసిన ఆయన, 2021 సీజన్ కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఎప్పుడు నిర్వహించాలన్న తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం అంతా జరిగితే ఫిబ్రవరి రెండు లేదా మూడవ వారంలో వేలం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఇక ఫ్రాంచైజీల యాజమాన్యాల బడ్జెట్ లో పెంపుదల లేదని స్పష్టం చేసిన ఆయన, గత సంవత్సరం బడ్జెట్ ప్రకారమే, వేలంలో ఆటగాళ్లను సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఇక, ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇండియాలో కరోనా వ్యాప్తి, టీకా పంపిణీ తదితరాలను పరిగణనలోకి తీసుకుని, ఇంకో నెల రోజుల తరువాత పోటీలు ప్రారంభమయ్యే తేదీలపై నిర్ణయిస్తామని అన్నారు.