Atchannaidu: అప్పుడు దుర్గామాత గుర్తుకు రాలేదా?: జగన్ కు అచ్చెన్నాయుడు సూటిప్రశ్న
- వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు?
- హిందువులు ఆగ్రహంగా ఉండటంతో ఆలయాల పునర్నిర్మాణం అంటున్నారు
- 19 నెలల కాలంలో దుర్గామాత గుర్తుకు రాలేదా?
రోడ్డు వెడల్పు కోసం గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 9 గుడుల పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్ భూమిపూజను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ దేవాలయాలను మళ్లీ నిర్మిస్తామంటే ఆయనను ఎవరైనా కాదంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై హిందూ సమాజం మొత్తం ఆగ్రహంగా ఉంది కాబట్టే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతుంటే ఇంత వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదని అచ్చెన్న మండిపడ్డారు. ఈ దాడులన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగాయని, దేవాలయాలకు జగన్ శంకుస్థాపన చేసినా, ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు. హిందువులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందువులకు ఏదో మంచి చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
కనకదుర్గ దేవాలయానికి రూ. 70 కోట్లు ఇస్తామని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెపుతున్నారని... ఈ 19 నెలల్లో దుర్గగుడి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత నాలుగైదు సార్లు ఆలయానికి వెళ్లిన జగన్ కు... అప్పుడు దుర్గామాత గుర్తుకు రాలేదా? అని దుయ్యబట్టారు. 150 ఆలయాలు ధ్వంసం అయిన తర్వాత, హిందువులలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్న తరుణంలో... జగన్ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.
తాము క్రిస్టియన్లు, ముస్లింలకు వ్యతిరేకం కాదని, చంద్రబాబు నాయకత్వంలో అన్ని మతాలను తాము సమానంగా చూశామని చెప్పారు. 1997లో ఒక చిన్న చర్చిపై దాడి జరిగితే హైదరాబాదులో ఉన్న చంద్రబాబు వెంటనే అక్కడి నుంచి ఏలూరుకు వచ్చారని, ఆ రాత్రి అక్కడే ఉండి నిందితులను అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. ఆలయాలపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ నిరసన కార్యక్రమాలను చేపట్టడం మంచి పరిణామమని... అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.