Border Gavaskar Trophy: బ్రిస్బేన్​ లో లాక్​ డౌన్​.. ఇండియా–ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు!

4th Test Mess New 3 day lockdown in Brisbane City puts Test match under fresh cloud
  • బ్రిస్బేన్ లో మూడు రోజుల లాక్ డౌన్
  • ఆటగాళ్లుండే హోటల్ లో ఉద్యోగికి బ్రిటన్ కరోనా
  • మ్యాచ్ ను రద్దు చేయాలన్న ఆలోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా
  • కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు వద్దంటున్న బీసీసీఐ 
  • బ్రిస్బేన్ లో మ్యాచ్ జరగకుంటే.. బ్యాకప్ వేదికగా సిడ్నీ గ్రౌండ్
ఇండియా–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ లో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్రిస్బేన్ లో జనవరి 15 నుంచి జరగాల్సిన చివరి టెస్టు జరుగుతుందా? జరుగదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బ్రిటన్ రకం కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో అధికారులు బ్రిస్బేన్ లో మూడు రోజుల లాక్ డౌన్ ను విధించారు. కఠినమైన ఆంక్షలు విధించారు.

‘‘బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టెస్టుపై లాక్ డౌన్ ప్రభావం ఎలా ఉండబోతోందన్న దానిని తేల్చేందుకు ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. లాక్ డౌన్ తో అక్కడ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నందున.. నిబంధనలను కాస్త సడలించాల్సిందిగా బీసీసీఐ కోరింది. లేకపోతే అక్కడ మ్యాచ్ ఆడడం కష్టమని చెప్పింది’’ అని అక్కడి మీడియా వ్యాఖ్యానించింది.

అంతేగాకుండా ఆటగాళ్లు ఉండాల్సిన హోటల్ లో ఓ ఉద్యోగికి బ్రిటన్ కరోనా రావడమూ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే గుణమున్న ఆ కరోనాతో ఆటగాళ్లకు ముప్పు రావొచ్చన్న ఆందోళనను క్రికెట్ ఆస్ట్రేలియా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నాలుగో టెస్టును రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ కు అనుమతినిస్తే అతి తక్కువ మంది ప్రేక్షకులకే అనుమతినివ్వాలన్న ఆలోచనలోనూ ఉంది. ఇంతకుముందు స్టేడియం పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 36 వేల మంది ప్రేక్షకులను అనుమతించేందుకు ఓకే చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం అనివార్యమైంది.

కాగా, బ్రిస్బేన్ లో పెట్టిన కఠినమైన క్వారంటైన్ ప్రొటోకాల్ నుంచి ఆటగాళ్లకు మినహాయింపును ఇవ్వాల్సిందిగా గురువారం క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ లేఖ రాసింది. ఆస్ట్రేలియా టూర్ ప్రారంభంలో ఇండియన్ ఆటగాళ్లంతా కఠినమైన ఐసోలేషన్ నిబంధనలు పాటించారని, ఈ నేపథ్యంలోనే బ్రిస్బేన్ లో మరిన్ని కఠినమైన ఆంక్షలు అవసరం లేదని పేర్కొంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా మౌఖికంగా సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, తమకు రాతపూర్వక హామీ కావాలని బీసీసీఐ అడుగుతోంది.

ఒకవేళ మ్యాచ్ ను రద్దు చేయొద్దని అనుకున్నా.. మన ఆటగాళ్లు బ్రిస్బేన్ కు వెళ్లొద్దని నిర్ణయించుకున్నా.. నాలుగో టెస్టుకు సిడ్నీ గ్రౌండ్ ను బ్యాకప్ గా వేదికగా పెట్టాలన్న చర్చ జరుగుతోంది.
Border Gavaskar Trophy
BCCI
CA

More Telugu News