Olympic Games: టోక్యోలో అత్యయిక పరిస్థితి... అయినప్పటికీ ఒలింపిక్స్ జరుపుతామన్న జపాన్ ప్రధాని
- గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్
- కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాదికి వాయిదా
- ప్రస్తుతం జపాన్ లో పెరుగుతున్న కేసులు
- ఒలింపిక్స్ నిర్వహణపై అనుమాన మేఘాలు
- ఆశలు కల్పించేలా ప్రకటన చేసిన జపాన్ ప్రధాని
జపాన్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోక్యో మహానగరంలో ఎమర్జెన్సీ విధించారు. దాంతో ఈ ఏడాది నిర్వహించాల్సిన ఒలింపిక్ క్రీడలపై నీలినీడలు పరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఆశాభావ ప్రకటన చేశారు. కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో టోక్యోలో అత్యయిక పరిస్థితి విధించినప్పటికీ ఈ వేసవిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, ఒలింపిక్స్ నిర్వహించే దేశం ఆనవాయితీ ప్రకారం ఒలింపిక్ కాగడాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒలింపిక్ కాగడాలతో స్ఫూర్తిని చాటుతారు. అయితే, కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో జపాన్ ప్రభుత్వం ఒలింపిక్ కాగడాల ప్రదర్శనను వాయిదా వేసింది. ప్రజల మధ్య కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టోక్యో అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా విలయం కారణంగా 2021కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.