Bhuma Akhila Priya: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
- కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ
- బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్
- కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
- అఖిలప్రియ సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని వెల్లడి
కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. అఖిలప్రియ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై పోలీసులు ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు బృందాలు సాక్ష్యాల సేకరణకు ప్రయత్నిస్తున్నందున, ఈ సమయంలో అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పోలీసులు తమ కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు.
అఖిలప్రియ విడుదలైతే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆమెకు రాజకీయ, ఆర్థిక పలుకుబడి మెండుగా ఉందని వివరించారు. ఆమె ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బెయిల్ ను ఉపయోగించుకునే అవకాశం ఉందని వివరించారు. హఫీజ్ పేటలో పాతిక ఎకరాల భూ వివాదంలో ప్రవీణ్ రావు అనే వ్యక్తితో పాటు ఆయన ఇద్దరు సోదరులు కిడ్నాప్ కు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు అఖిలప్రియను ఏ1గా, ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, అఖిలప్రియ భర్త భార్గవరామ్ ను ఏ3గా పేర్కొన్న సంగతి తెలిసిందే.