Major Incident: లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా... 'పెను విపత్తు'గా ప్రకటించిన మేయర్
- బ్రిటన్ లో కలకలం సృష్టిస్తున్న కొత్త కరోనా
- లండన్ ఆసుపత్రుల్లో ఇక బెడ్లు దొరకవన్న మేయర్
- చర్యలు తీసుకోకపోతే చాలామంది చనిపోతారని వెల్లడి
- ప్రధాని బోరిస్ జాన్సన్ వెంటనే స్పందించాలని వినతి
లండన్ లో కొత్తరకం కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోందంటూ లండన్ మహానగర మేయర్ సాదిక్ ఖాన్ వెల్లడించారు. లండన్ లోని ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా సోకిందని తెలిపారు. ప్రస్తుతం లండన్ నగరం సంక్షోభం అంచున నిలిచిందని, అందుకే లండన్ లో 'పెను విపత్తు' ప్రకటన చేసినట్టు సాదిక్ ఖాన్ పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే గనుక ఆసుపత్రులు రోగులతో క్రిక్కిరిసిపోతాయని, చాలామంది ప్రజలు చనిపోతారని హెచ్చరించారు. మరో రెండు వారాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నది వాస్తవం అని తెలిపారు. తన ప్రకటన దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ను కదిలిస్తుందని, ఆయన వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.