Andhra Pradesh: ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్‌పై రగడ.. తీవ్రంగా తప్పుబట్టిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది

Gopalakrishna Dwivedi Responds On Nimmagadda Notifiation

  • ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి నోటిఫికేషనా?
  • నిమ్మగడ్డది అధికార దురహంకారం
  • రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు లేవు
  • ప్రభుత్వ అభిప్రాయాలను బేఖాతరు చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై రగడ మొదలైంది. నిమ్మగడ్డ నిర్ణయం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమేనని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ద్వివేది గత రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకు నేడు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారని అన్నారు. అధికారులు, సిబ్బంది మొత్తం టీకా సన్నాహక కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారని తెలిపారు. 11న మోదీ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13 తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపడదామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానథ్ దాస్ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారని, అయినప్పటికీ నిమ్మగడ్డ పట్టించుకోలేదని అన్నారు.

రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణం లేకున్నా, ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. ఇది ముమ్మాటికి అధికార దురహంకారమేనని ద్వివేది విమర్శించారు.

  • Loading...

More Telugu News