Gorantla Butchaiah Chowdary: జగన్ క్వశ్చన్ మార్క్ పాలన చేస్తున్నారు: బుచ్చయ్య చౌదరి సెటైర్
- ఎవరికీ అర్థం కాని గజిబిజి పాలన చేస్తున్నారు
- 'అప్పు చేసి పప్పు కూడు' అనే పథకాన్ని జగన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నారు
- రాబోయే రోజుల్లో ఆ పప్పు కూడు కూడా ఉండదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన గందరగోళంగా ఉందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ లు వేసిన జగన్... ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరికీ అర్థం కాని రీతిలో గజిబిజి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. 'గజిబిజినాదం.. గందరగోళం.. జగన్నాథం' అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి పాలన ఉందని అన్నారు.
సంక్రాంతి ముందే వచ్చిందని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారని... నిజమే మీ సాక్షి పేపర్ లో ప్రభుత్వ ప్రకటనల రూపంలో ముందే వచ్చిందని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. మీ అనుచరుల బాజా భజంత్రీల మధ్య వచ్చిందని విమర్శించారు. ప్రజలకు మాత్రం మిగిలింది ఏమీ లేదని అన్నారు.
రూ. 6,400 కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. రూ. 6,400 కోట్లలో 70 శాతం మొత్తాన్ని న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నట్టు పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు. 'మీరు మాత్రం మా ప్రభుత్వం చేస్తుంది ఒప్పు అంటున్నారు...! వాస్తవ రూపంలో మాత్రం అది అప్పుగా ఉంది. ఏది సమంజసం అనేది ప్రభుత్వం చెప్పాలి' అని కామెంట్ చేశారు. 'అప్పు చేసి పప్పు కూడు' అనే పథకాన్ని జగన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులు ఎక్కువైతే... రానున్న రోజుల్లో ఆ పప్పు కూడు కూడా దొరికే పరిస్థితి ఉండదని అన్నారు.