Ayyanna Patrudu: కరోనా ప్రభావం తగ్గిందని పాఠశాలలు తెరిచారు... ఎన్నికలంటే వణుకు ఎందుకు?: అయ్యన్నపాత్రుడు
- ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
- నిమ్మగడ్డను టీడీపీ మనిషంటున్నారని అయ్యన్న ఆరోపణ
- ఫేక్ సీఎం అప్పట్లో నోరు పారేసుకున్నాడని వెల్లడి
- మరోసారి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
- పులివెందుల పిల్లికి వణుకు పుడుతోందని ఎద్దేవా
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా ప్రభావం తగ్గిందని పాఠశాలలు తెరిచిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలంటే ఎందుకు భయపడుతోందని సూటిగా ప్రశ్నించారు.
"కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ టీడీపీ వ్యక్తి అంటూ ఫేక్ సీఎం జగన్ నోరు పారేసుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గిందని పాఠశాలలు తెరిచిన ఈ ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే నిమ్మగడ్డ టీడీపీ మనిషి అని మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. అసలు విషయం ఏంటంటే... రాష్ట్రంలో చెత్తపాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే రహస్య నివేదికలను ప్రశాంత్ కిశోర్ అందజేశాడు. అందుకే పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి అర్థంపర్థంలేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడు" అంటూ వ్యాఖ్యానించారు.