India: ఇండియాలో 90కి పెరిగిన కొత్త కరోనా కేసులు!
- గడచిన 24 గంటల వ్యవధిలో 8 కొత్త స్ట్రెయిన్ కేసులు
- బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు
- ఆపైనే దేశంలోకి అనుమతిస్తున్నామన్న అధికారులు
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు ఇండియాలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్త కరోనా కేసులు 8 రాగా, మొత్తం కేసుల సంఖ్య 90కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కేంద్రం, బ్రిటన్ నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికుల కారణంగానే ఈ వైరస్ ఇండియాకు వచ్చిందని నిపుణులు అంటున్నారు.
యూకే నుంచి వచ్చిన విమానాల్లో వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలనూ సేకరించామని, తొలి కొత్త స్ట్రెయిన్ డిసెంబర్ 30న వెలుగులోకి వచ్చిందని గుర్తు చేసిన అధికారులు, తొలుత ఆరుగురికి వైరస్ సోకినట్టు గుర్తించామని, ఆపై కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ, వారి కుటుంబీకులను, వారితో సన్నిహితంగా మెలిగిన అందరినీ గుర్తిస్తున్నామని వెల్లడించారు.
గత 38 రోజుల్లో బ్రిన్ కు వెళ్లి వచ్చిన వారందరినీ అబ్జర్వేషన్ లోనే ఉంచామని స్పష్టం చేశారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య మొత్తం 33 వేల మందికి పైగా ప్రయాణికులు ఇండియాకు వచ్చారని, అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేశామని కేంద్ర అధికారులు వెల్లడించారు. బ్రిటన్ తో పాటుడెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ ల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు చేసిన తరువాతనే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు.