Yanamala: స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ జగన్నాటకం: యనమల
- ఎన్నికలకు ఈసీకి ప్రభుత్వం సహకరించట్లేదు
- దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
- ఈ పరిణామాలను ఉపేక్షించవద్దు
- ఆర్టికల్ 243ఏ, 243కే(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ
- ఈ అధికారం ఈసీకే ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం సీఎం వైఎస్ జగన్ అండ్ కోకు లేదని, అందుకే ఈ జగన్నాటకాన్ని ఆడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీకి ప్రభుత్వం సహకరించకపోవడం సరికాదని అన్నారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ఉపేక్షించవద్దని చెప్పారు.
ఆర్టికల్ 243ఏ, 243కే(1) ప్రకారం ఎన్నికల నిర్వహణపై అధికారం ఈసీకే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అలాగే, ఈ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా గవర్నరే చూడాలని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే(3) ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో లేదని విమర్శించారు. అలాగే, ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ విషయాన్ని చెప్పడం ఏ రాష్ట్రంలోనూ లేదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాల ముందు క్యూల నిర్వహణకు అభ్యంతరాలు చెప్పలేదని, ఎన్నికలకు మాత్రం చెబుతున్నారని విమర్శలు గుప్పించారు.