Delirium: ఐసీయూలో కరోనా రోగులు ప్రధానంగా ఏ సమస్యలు ఎదుర్కొన్నారో తెలుసా..?
- కరోనా ప్రభావంతో కోమా, మతిచాంచల్యం లక్షణాలు
- ఐసీయూలో రోగులకు ఇవే ప్రధాన సమస్యలని నిపుణుల వెల్లడి
- ఔషధాలు, మానసిక కుంగుబాటే అందుకు కారణమని వివరణ
- లాన్సెట్ లో కథనం
గత ఏడాది కాలంగా కరోనా భూతం ప్రపంచాన్ని కొరకరాని కొయ్యలా పట్టి పీడిస్తోంది. వ్యాక్సిన్లు రావడం ఊరట కలిగించే అంశం అయినా, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, ఆ వైరస్ ప్రభావంతో శారీరకంగా దెబ్బతిన్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే ది లాన్సెన్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ద్వారా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో పరిస్థితి విషమించి ఐసీయూలో చేరినవాళ్లలో నెమ్ము, ఇతర శ్వాస సంబంధ సమస్యల కంటే చిత్తచాంచల్యం, కోమా వంటి మెదడు సంబంధ సమస్యలే ఎక్కువగా కనిపించాయని ఆ అధ్యయనంలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 28కి ముందు 14 దేశాల్లో ఐసీయూలను పరిశీలించగా, వాటిలో 2000 మంది మతిభ్రమించడం, కోమా వంటి లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు.
కరోనా సోకినవారితో కుటుంబ సభ్యులను కలవనివ్వకపోవడం వల్ల వారిలో మానసికంగా కుంగుబాటు లక్షణాలు కనిపించి, అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిందని, పైగా మగత కలిగించే మందులు కూడా మెదడు పనితీరును ప్రభావితం చేశాయని ఈ అధ్యయనం చేపట్టిన వాండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ (అమెరికా) పరిశోధకులు వివరించారు.
దాదాపు 82 శాతం రోగులు 10 రోజుల పాటు కోమాలోనే ఉండగా, 55 శాతం రోగులు కనీసం మూడు రోజుల పాటు మనో వైకల్యంతో బాధపడ్డారని తెలిపారు. మెదడు పనితీరు గతితప్పడం సగటున 12 రోజుల పాటు కనిపించిందని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఐసీయూ సిబ్బంది రోగులకు అధిక మోతాదులో మగత కలిగించే మందులు వాడడం తగ్గించాలని, వారిని తరచుగా మేల్కొలుపుతూ వారితో శ్వాస సంబంధ కసరత్తులు చేయిస్తుండడం, సురక్షిత పద్ధతులు పాటిస్తూ రోగులను వారి కుటుంబసభ్యులు కలిసే అవకాశం కల్పించడం, లేక వర్చువల్ విధానంలో మాట్లాడించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రతీక్ పండరి పాండే వివరించారు.