Gorantla Butchaiah Chowdary: ఎన్నికలంటే భయం లేనప్పుడు ఎందుకు వెనకడుగు?: బుచ్చయ్య చౌదరి
- ప్రజారోగ్యం దృష్ట్యా అని చెబుతున్నారు
- కొన్ని నెలల క్రితం ఎన్నికలు వాయిదా వేస్తే అభ్యంతరాలు చెప్పారు
- బహుశా రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రభుత్వం వెళ్తుంది
- ఇది ఏ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలిపారు.
'ఎన్నికల నిర్వహణ అనేది ఈసీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతుంది. దానికి అధికార నేతలు తెలుగుదేశం పార్టీ వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు నిజంగా ఎన్నికలు అంటే భయం లేనప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?' అని ప్రశ్నించారు.
'ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అని చెబుతున్న మీరు ముమ్మరంగా కరోనా ప్రబలుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఎందుకు గొంతు చించుకొని మాట్లాడారు?' అన్నారు.
'బహుశా రాజ్యాంగ సంక్షోభం దిశగా ప్రభుత్వం వెళ్తుంది అనే అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అధికారం ఉంది అని వ్యవస్థలను కూలదోయడం విచారకరం. ఇది ఏ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. రాజ్యాంగ అనుకూల విధానం ద్వారానే పరిపాలన నిర్ణయాలు తీసుకోవాలి' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.