Devendra Fadnavis: మహారాష్ట్ర ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తగ్గించడంపై ఫడ్నవిస్ స్పందన!
- నాకు సెక్యూరిటీ కావాలని ఎప్పుడూ అడగలేదు
- సీఎం అయిన తర్వాతే తనకు తొలి సారి సెక్యూరిటీ లభించింది
- భద్రతపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు కల్పిస్తున్న భద్రతను ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తగ్గించింది. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రతను కల్పించాలని తానెప్పుడూ కోరలేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తాను సెక్యూరిటీ కావాలని అడగలేదని చెప్పారు.
తాను ముఖ్య మంత్రిని అయిన తర్వాతే సెక్యూరిటీ వచ్చిందని తెలిపారు. అది కూడా యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేయడం వంటి పరిణామాలు సంభవించిన తర్వాత, తనకు బెదిరింపులు వచ్చాయని... అప్పుడే భద్రతను తీసుకున్నానని చెప్పారు. ముప్పు ఉన్న వారికే భద్రతను కల్పించాలని తాను భావిస్తానని అన్నారు.
కాగా, ఫడ్నవిస్ సెక్యూరిటీని జడ్ ప్లస్ నుంచి వై ప్లస్ కి మార్చారు. ఆయన భార్య అమృత, కుమార్తె దివిజ భద్రతను వై ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి తగ్గించారు. రాజకీయ కోణంలోనే తన భద్రతను తగ్గించారని ఫడ్నవిస్ అన్నారు. ఎలాంటి ముప్పు లేని కొందరికి భారీ సెక్యూరిటీని కల్పించారని చెప్పారు. తనకు భద్రతను తగ్గించడాన్ని తాను పట్టించుకోనని అన్నారు. ఎవరి భద్రత గురించైనా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు.
మరోవైపు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే భద్రతను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది.