Supreme Court: వ్యవసాయ చట్టాల అమలును మీరు నిలుపుదల చేస్తారా? లేక మమ్మల్నే చేయమంటారా?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతా వ్యతిరేకత ఉంది
- రైతులతో జరుపుతున్న చర్చల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు
- సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే మా లక్ష్యం
కొత్త వ్యవసాయ చట్టాలపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య పలు విడతలుగా చర్చలు జరిగినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. మరోవైపు ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. రైతులతో జరుగున్న చర్చల్లో ఏం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.
రైతు ఆందోళనల్లో పాల్గొన్న వారిలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారని చెప్పింది. ఏదైనా తప్పు జరిగినప్పుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. తమ చేతులకు రక్తం అంటుకోవాలని తాము కోరుకోవడం లేదని చెప్పింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతా వ్యతిరేకత ఉందని... చట్టాలు ప్రయోజనకరమని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాము చెప్పడం లేదని జస్టిస్ బాబ్డే అన్నారు. సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నామని... ఈ కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు వ్యవసాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఈ చట్టాలను కొంత కాలం నిలిపివేయగలరా? అని ప్రశ్నించింది. ఆ పని మీరు చేయలేకపోతే తామే చేస్తామని చెప్పారు.
మరోవైపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపిస్తూ, చట్టాలను నిలిపివేయడం కుదరదని అన్నారు. అయితే, దీనిపై సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా కానీ, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా కానీ ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు ఉండదని తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయాన్ని చెపుతున్నాయని అన్నారు. కొత్త చట్టాలపై కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారు మాత్రమే ఆందోళన చేస్తున్నారని... మిగిలిన దేశమంతా సంతృప్తిగానే ఉందని చెప్పారు.