Jagan: అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు కొత్తవేషం కడుతున్నారు: సీఎం జగన్
- అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- నెల్లూరు జిల్లాలో కార్యక్రమం
- విగ్రహాల ధ్వంసం ఘటనలపై స్పందించిన వైనం
- చంద్రబాబు, లోకేశ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ
- అప్రమత్తంగా ఉండాలని సూచన
ఏపీ సీఎం జగన్ ఇవాళ అమ్మఒడి పథకం రెండో విడత నిధుల చెల్లింపులను లాంఛనంగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన స్పందించారు. విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి... ధ్వంసమైన విగ్రహాలు చూస్తామని ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోండి అని వ్యాఖ్యానించారు. రథాలు ఎందుకు తగులబెడుతున్నారో, ఆ తర్వాత రథయాత్ర ఎందుకు చేయబోతున్నారో గమనించండి అని పేర్కొన్నారు.
"ఇవాళ ప్రతిపక్షాల కడుపుమంట తీవ్రస్థాయిలో ఉంది. ఎవరూ లేని ప్రాంతాల్లో గుడులను ధ్వంసం చేస్తున్నారు. దేవుడి మీద భక్తిలేని వారే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టే ముందో, తర్వాతో ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు. మనం చేసిన మంచి ప్రపంచానికి తెలియొద్దనే దాడులు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోరాటం చేస్తున్నాం. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసినవాళ్లు కొత్తవేషం కడుతున్నారు. కొవిడ్ భయంతో విపక్ష నేత, ఆయన కొడుకు హైదరాబాదులో దాక్కుంటారు. సామాన్యులు బతికితే ఎంత, చస్తే ఎంత అంటూ ఆయన కోవర్టులు ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతుంటారు. ఇలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి" అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.