Pothula Suneetha: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీతను ఖరారు చేసిన సీఎం జగన్
- తాను ఖాళీ చేసిన స్థానానికి మళ్లీ తానే పోటీచేస్తున్న సునీత
- గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన వైనం
- రాజీనామా చేసి వైసీపీలో చేరిక
- శాసనమండలిలో ఖాళీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్
- పోతుల సునీతకు బీఫామ్ అందజేసిన సీఎం జగన్
గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా వ్యవహరించిన పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో శాసనమండలిలో ఖాళీ ఏర్పడింది. ఆ ఒక్క ఖాళీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా, వైసీపీ తరఫున పోతుల సునీతకే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ఇవాళ నిర్ణయించారు. తద్వారా ఆమె ఖాళీ చేసిన సీటును ఆమెకే కేటాయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. ఆమెకు బీఫామ్ అందజేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం పట్ల పోతుల సునీత సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పోతుల సునీత 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. చీరాల అసెంబ్లీ స్థానంలో గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దాంతో పోతుల సునీత వర్గానికి, ఆమంచి వర్గానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమెకు టీడీపీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. ఇక 2019 ఎన్నికల వేళ ఆమంచి వైసీపీలోకి వెళ్లగా, సునీత మాత్రం టీడీపీలోనే ఉన్నారు.
అయితే, ఎన్నికల అనంతరం ఆమె టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీకి మద్దతు పలుకుతుండడంతో ఆమెపై అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనమండలి చైర్మన్ ను కోరింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో మండలిలో ఖాళీ ఏర్పడింది.