Pawan Kalyan: మంత్రి గౌతమ్ రెడ్డి విజ్ఞతపై సందేహాలు వస్తున్నాయి: దివీస్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ విమర్శలు
- తూర్పుగోదావరిలో దివీస్ రగడ
- దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు
- ప్రజలకు పవన్ మద్దతు
- మంత్రి మేకపాటిపై విమర్శలు
తూర్పు గోదావరి జిల్లాలో దివీస్ పరిశ్రమను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సమస్య రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక ప్రజలకు జనసేన పార్టీ మద్దతిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ హయాంలోనే దివీస్ ఏర్పాటైందని వైసీపీ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. దివీస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతమ్ రెడ్డి కథలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
దివీస్ పై స్పందించమని కోరితే, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడాలని మంత్రి కోరుతుండడం ఆయన విజ్ఞతపై సందేహాలు కలిగిస్తోందని తెలిపారు. మంత్రి మాటలు వింటుంటే సమస్యను ఏమార్చే విధంగా ఉన్నాయని విమర్శించారు. కొత్తపాకలలో ఏర్పాటు చేస్తున్న దివీస్ పరిశ్రమ కారణంగా 15 గ్రామాలకు చెందిన ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులుకు చేరడం లేదా? అని పవన్ నిలదీశారు. ఆ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు అని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సబబో మీరు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు ఆపరా? లేక ఆపలేరా? అని ప్రశ్నించారు.
"చంద్రబాబు ప్రారంభంచిన అన్నింటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా... రాజధాని అమరావతిని ఆపారు, పోలవరం ప్రాజెక్టును రివర్స్ లో తీసుకువెళుతున్నారు. అదే విధంగా దివీస్ పరిశ్రమ విషయంలోనూ నిర్ణయం తీసుకోవచ్చుగా. అరెస్ట్ చేసిన ఆ 36 మందిని విడుదల చేయలేరా? వారేమైనా సూటుకేసు కంపెనీలు ఏర్పాటు చేసి మోసాలు చేశారా? లేకపోతే ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీకింత, నాకింత అని తీసుకున్నారా? లేదా, ప్రత్యర్థులను పథకం ప్రకారం హతమార్చారా? ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దన్నందుకు వారిని జైల్లో పెడతారా? వాళ్ల కుటుంబ సభ్యుల ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఆ 36 మందిని విడిచిపెట్టాలని మీరు చెబుతున్నట్టు మాకు తెలిసింది... కానీ ఇప్పటికీ వాళ్లు జైల్లోనే ఉన్నారంటే మీ మాటలు ఎవరూ పట్టించుకోవడంలేదనుకోవాలా?" అని వ్యాఖ్యలు చేశారు.