China: చలి పులికి భయపడి ఎల్ఏసీ నుంచి సైనికులను ఉపసంహరించుకున్న చైనా!
- భారత్ తో సరిహద్దుల్లో 50 వేలమందిని మోహరించిన చైనా
- ఎల్ఏసీ వద్ద బాగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
- పెరిగిన చలితో సైనికుల ఇబ్బంది
- ఇప్పటికే 10 వేల మంది ఉపసంహరణ
గత కొన్నినెలలుగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైనిక మోహరింపులు చేపట్టిన చైనా ఇప్పుడు ప్రకృతికి భయపడి వెనుకంజ వేసింది. హిమాలయ పర్వత ప్రాంతంలో చలితో గడ్టకట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడడంతో పెద్దసంఖ్యలో సైనికులను ఉసంహరించుకుంటోంది. ఎల్ఏసీ నుంచి ఇప్పటికే 10 వేల మంది సైనికులను వెనక్కిపిలిపించినట్టు వెల్లడైంది. ఇప్పుడా స్థావరాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గతేడాది మార్చి-ఏప్రిల్ లో యావత్ ప్రపంచం కరోనాతో ముమ్మర పోరాటం సాగిస్తున్న వేళ డ్రాగన్ మాత్రం భారత్ తో సరిహద్దుల్లో 50 వేల మంది సైనికులను మోహరించింది. అయితే, ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో సైనికులను అక్కడ ఉంచడం శ్రేయస్కరం కాదని భావించిన చైనా ఉపసంహరించుకుంటోంది. చలికి తోడు, పెద్ద సంఖ్యలో సైనికుల నిర్వహణ కష్టసాధ్యం కావడంతో ఎవరి స్థావరాలకు వారిని పంపించివేస్తున్నట్టు తెలుస్తోంది.