Whatsapp: ప్రైవసీ పాలసీ నిబంధనలపై ఓ మెట్టు దిగిన వాట్సాప్!

Whats app Clarifies on their New Privacy Policy
  • ఇటీవల మారిన ప్రైవసీ నిబంధనలు
  • విమర్శలు వెల్లువెత్తడంతో వాట్సాప్ వివరణ
  • ఊహాగానాలు నమ్మరాదని వినతి
  • ప్రైవేటు ఖాతాల్లోని సమాచారం రహస్యమేనని వెల్లడి
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇటీవల మార్పు చేర్పులతో తీసుకుని వచ్చిన ప్రైవసీ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన వేళ, యాజమాన్యం ఓ మెట్టు దిగింది. ప్రస్తుతం ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్సాప్, ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, అన్ని ప్రైవేటు మెసేజ్ లూ 100 శాతం సురక్షితంగా ఉంటాయని, ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని, బంధుమిత్రులు, స్నేహితులకు పంపే సమాచారం పూర్తి రహస్యమని వెల్లడించింది. వాట్సాప్ ద్వారా బట్వాడా అయ్యే సమాచారాన్ని ఫేస్ బుక్ తో కూడా పంచుకోబోమని స్పష్టం చేసింది.

ఎవరి ప్రైవేటు మెసేజ్ లను తాము చూడబోమని, కాల్స్ ను కూడా వినబోమని స్పష్టం చేసిన వాట్సాప్, అయితే కాల్ లాగ్స్ ను మాత్రం దాచి వుంచుతామని వెల్లడించింది. ఇక తమ మాధ్యమం ద్వారా లోకేషన్ షేర్ చేసినా, ఆ వివరాలను చూడబోమని, ఫేస్ బుక్ కు ఇవ్వబోమని, కాంటాక్టుల వివరాలను కూడా ఎవరితోనూ పంచుకోబోమని పేర్కొంది.

ఫేస్ బుక్ యాజమాన్యంలో ఉన్నా, వాట్సాప్ గ్రూప్ ప్రైవేటు సంస్థగానే వ్యవహరిస్తుందని, యూజర్లు అవసరమనుకుంటే, తమ మెసేజ్ లను నియమిత సమయం తరువాత డిలీట్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చని, ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను తిరిగి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపింది.
Whatsapp
Messages
Privacy Policty

More Telugu News