COVID19: కర్ణాటకలో వీఐపీలకు బ్లాక్ మార్కెట్లో కొవిడ్​ వ్యాక్సిన్లు?

VIPs in Karnataka offered vaccine for bitcoins

  • బ్లాక్ మార్కెట్ వ్యాక్సిన్లపై ఫోన్లు వస్తున్నాయన్న కర్ణాటక వైద్యులు
  • ధ్రువీకరించిన ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ సంఘం
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచన
  • ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న కర్ణాటక కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు

కొవిడ్ టీకాల రవాణాను ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం మొదలుపెడుతోంది. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు అవి ఇంకా చేరనేలేదు. కానీ, అప్పుడే వాటి బ్లాక్ మార్కెట్ దందా మొదలవుతోంది. కర్ణాటకలో కొందరు వీఐపీలకు ఈ వ్యాక్సిన్లను బ్లాక్ మార్కెట్లో బిట్ కాయిన్లకు ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఆయా వీఐపీలు తమకు తెలిసిన కొంతమంది డాక్టర్లకు ఫోన్ చేసి బ్లాక్ మార్కెట్ లో దొరికే ఆ టీకాల గురించి వాకబు చేస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సంఘం (ఫానా) ధ్రువీకరించింది. అలాంటి వ్యాక్సిన్లను తీసుకోవద్దని ప్రజలకు సూచించింది. బిట్ కాయిన్లిస్తే వ్యాక్సిన్ ఇస్తామంటూ కొందరు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసిందని ఫానా అధ్యక్షుడు డాక్టర్ హెచ్ఎం ప్రసన్న చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజలు అనుసరించాలని సూచించారు.

‘‘బ్లాక్ మార్కెట్ డీలర్ల వద్ద లభించే వ్యాక్సిన్లు సురక్షితమేనా? కాదా? అని సమాజంలో పలుకుబడి ఉన్న చాలా మంది వీఐపీలు ఫోన్లు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్లు వేసుకోవచ్చా? లేదా? అని అడుగుతున్నారు. అయితే, బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్న ఆ వ్యాక్సిన్లు ఏంటన్నవి మాత్రం వాళ్లు చెప్పట్లేదు. వ్యాక్సిన్ పేరు, తయారు చేసిన సంస్థ, ధర వంటివి వెల్లడించట్లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వని ఎలాంటి ఔషధాన్నైనా అమ్మితే అది చట్టవిరుద్ధమే’’ అని పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొందరు వైద్యులు తేల్చి చెబుతున్నారు.  

‘‘కొందరు వీఐపీలు నాకు ఫోన్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నామని కొందరు చెబితే.. వ్యాక్సిన్ పై ఆఫర్లు వచ్చాయని మరికొందరు వెల్లడించారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. అలాంటి వాటిని బ్లాక్ చేసి అమ్మితే అనైతికమే అవుతుంది’’ అని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ చెప్పారు.

ప్రస్తుతానికైతే కొవిడ్ వ్యాక్సిన్ల బ్లాక్ మార్కెట్ దందా గురించి తమ దృష్టికి రాలేదని కర్ణాటక కొవిడ్ నియంత్రణ, నిర్వహణ సాంకేతిక సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్ గిరిధర బాబు చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం ఇలాంటి బ్లాక్ మార్కెట్ దందాపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. దీని వల్ల డబ్బున్న వారికే వ్యాక్సిన్ అందుతుందని, పేదలకు దక్కకుండా పోతుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News