Donald Trump: ఆఖరి రోజుల్లో నష్ట నివారణకు... కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!
- మరో 9 రోజుల్లో దిగిపోనున్న ట్రంప్
- ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు
- వాషింగ్టన్ డీసీ పరిధిలో ఆంక్షలు
మరో తొమ్మిది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, భవిష్యత్తులో తన రాజకీయ జీవితానికి అడ్డంకులు ఏర్పడవచ్చన్న ఆలోచనలో ఉన్న ఆయన, కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని వాషింగ్టన్ డీసీ పరిధిలో అత్యయిక స్థితిని అమల్లోకి తీసుకువచ్చేలా తయారు చేసిన కార్య నిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేసేలోగా, పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవచ్చని ఎఫ్బీఐ హెచ్చరికలు జారీ చేసిన వేళ, నగర మేయర్ మురియెల్ బౌసర్ అత్యవసర పరిస్థితి విధించాలని సిఫార్సు చేశారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. గత వారంలో క్యాపిటల్ భవంతిపై దాడి తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడే కొద్దీ ఘర్షణల తీవ్రత పెరగవచ్చని కూడా ఎఫ్బీఐ హెచ్చరించింది. రాజధానితో పాటు అన్ని ముఖ్య నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా ఎఫ్బీఐ సూచించింది.
ఇదిలావుండగా, ఎమర్జెన్సీ కారణంగా స్థానికులు ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే, పరిష్కరించేందుకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఎఫ్ఈఎంఏ (ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజన్సీ) అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టారు. ఆస్తుల ధ్వంసానికి నిరసనకారులు దిగితే, నిలువరించేందుకు ఎటువంటి చర్యలకైనా సైన్యం దిగనుంది. ఇందుకోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.