Telugu Yuvatha: తెలుగు యువత అధ్యక్షుడిగా శ్రీరామ్ చినబాబును నియమించిన చంద్రబాబు!
- చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన శ్రీరామ్
- గతంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా చేసిన చినబాబు
- నల్లారి కిశోర్ కుమార్ పై దాడి సమయంలో పక్కనే ఉన్న చినబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన శ్రీరామ్ చినబాబును టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. ఏ మాత్రం ముందస్తు హడావుడి లేకుండా చంద్రబాబు ఈ నియామకాన్ని పూర్తి చేశారు. చినబాబు బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పని చేశారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు మదనపల్లెలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ వర్గీయులపై పట్టు ఉంది.
అయితే టీడీపీలో చేరిన చినబాబుకు స్థానిక రాజకీయాల కారణంగా తొలుత పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. మదనపల్లె సమీపంలోని అంగళ్లు గ్రామం వద్ద ఇటీవల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కిశోర్ కుమార్ రెడ్డి తీసుకెళ్లారు. ఆ తర్వాత చినబాబు గురించి చంద్రబాబు ఆరా తీసి... ఆయన నాయకత్వ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు యువత పగ్గాలను అప్పగించారు.