Bhuma Akhila Priya: నేను రాజకీయ నాయకురాలిని.. ఎంతో మంది ఫోన్ చేస్తుంటారు: పోలీసు విచారణలో అఖిలప్రియ
- రెండో రోజు ముగిసిన అఖిలప్రియ కస్టడీ విచారణ
- తన భర్త ఎక్కడున్నారో తెలియదన్న అఖిలప్రియ
- ప్రవీణ్ రావు కుటుంబంతో తమకు భూవివాదం ఉందని వ్యాఖ్య
హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీకి ఆమెను కోర్టు అప్పగించింది. ఈరోజుతో రెండో రోజు విచారణ ముగిసింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు అఖిలప్రియను విచారించారు. కిడ్నాపర్ల నుంచి అఖిలప్రియకు వచ్చిన ఫోన్ కాల్ పై ఈ సందర్భంగా వారు ప్రశ్నించినట్టు సమాచారం.
తాను రాజకీయ నాయకురాలినని, ప్రతి రోజు ఎంతో మంది తనకు ఫోన్ కాల్స్ చేస్తుంటారని, అందులో భాగంగానే గుంటూరు శ్రీనుతో మాట్లాడానని అఖిలప్రియ చెప్పినట్టు తెలుస్తోంది. టవర్ లొకేషన్, సిమ్ కార్డ్ నంబర్లను కూడా అఖిలప్రియ ముందుంచి ప్రశ్నించినా.. తనకేమీ తెలియదని ఆమె సమాధానమిచినట్టు సమాచారం. ప్రవీణ్ రావు కుటుంబసభ్యులకు, తమకు మధ్య భూవివాదం ఉందని తెలిపారు. తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నారో తెలియదని చెప్పారు.