Sajjala Rama Krishna Reddy: విశాఖకు రాజధాని తరలింపు వ్యవహారం నాలుగు నెలల్లో మొదలవుతుంది: సజ్జల
- ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయి
- నిమ్మగడ్డ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు
- ఆయన ప్రతి అడుగు చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలవుతుందని ఆయన అన్నారు. ఈలోగా దీనికి సంబంధించి కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ కారణం వల్లే ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ ను, ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ ను నిమ్మగడ్డ రమేశ్ తొలగించడంపై స్పందిస్తూ... ఉద్యోగులను బెదిరించేలా ఈ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు.
నిమ్మగడ్డ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ బాధ్యత ఉన్న వ్యక్తిగా నిమ్మగడ్డ వ్యవహరించడం లేదని విమర్శించారు. నిమ్మగడ్డ ప్రతి అడుగు టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోందని చెప్పారు.