Mike Pence: ట్రంప్ అభిశంసన ప్రతిపాదనను తిరస్కరించిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్!
- ట్రంప్ పాలనకు మరో 8 రోజులు
- ఈ సమయంలో ఇటువంటివి చేయలేను
- నాన్సీ పెలోసీకి లేఖ రాసిన మైక్ పెన్స్
అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పదవి నుంచి తొలగించడానికి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిరాకరించారు. దీంతో మరో 8 రోజులు మాత్రమే అధికారికంగా పదవిలో ఉండనున్న ట్రంప్ ను అభిశంసించాలన్న డెమోక్రాట్ల ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లయింది. డెమొక్రాట్ల ప్రయత్నాలకు ఇప్పటికే కొందరు రిపబ్లికన్లు కూడా మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.
"ఇకపై కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ట్రంప్ అధికారంలో ఉంటారు. మీరు, డెమొక్రాటిక్ ప్రతినిధులు 25వ అధికరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి నా మద్దతు కోరుతున్నారు. నేను అంగీకరించలేను" అని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో పెన్స్ స్పష్టం చేశారు.
కాగా, మైక్ పెన్స్ అంగీకరించి, ట్రంప్ అభిశంసనకు గురైతే, భవిష్యత్తులో ఆయన మరోమారు అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలు ఉండవు. ఇదే సమయంలో ట్రంప్ కాల పరిమితి ముగిసేంత వరకూ తాత్కాలిక యూఎస్ అధ్యక్షుడిగా పెన్స్ బాధ్యతలు చేపట్టాల్సి వుంటుంది. "ఇటువంటి చర్యలు అమెరికాకు, రాజ్యాంగానికి మంచిది కాదనే నేను భావిస్తున్నాను. ఇవి జాతి ప్రయోజనాలను కాపాడలేవు" అని కూడా మైక్ పెన్స్ అభిప్రాయపడ్డారు.