Bharat Biotech: 16.50 లక్షల డోస్ ల వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్న భారత్ బయోటెక్!
- కరోనాపై పోరులో మా వంతు సహకారం ఇస్తాం
- సుమారు ఆర కోటి డోస్ లను అందించనున్న బీబీఐఎల్
- ప్రభుత్వానికి ఒక్కోటి రూ. 295 ధరకు విక్రయం
తాము తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలను తొలిదశలో ఉచితంగా ప్రభుత్వానికి ఇవ్వనున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. కరోనాపై జరుగుతున్న పోరాటంలో భాగంగా కేంద్రానికి తమవంతు సహకారాన్ని అందించేందుకు 16.50 లక్షల డోస్ లను ఉచితంగా ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ప్రకటించిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.
కాగా, మొత్తం 55 లక్షల డోస్ లను భారత్ బయోటెక్ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కరోనాను నివారించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎన్ని డోస్ లను కొంటున్నారు? భారత్ బయోటెక్ నుంచి ఎన్ని డోస్ లను తీసుకుంటున్నారన్న విషయంలో ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ, కేంద్రం స్పందించింది.
భారత్ బయోటెక్ నుంచి లభించే మిగతా 38.50 లక్షల డోస్ లకు సంస్థ ఒక్కో టీకాకు రూ. 295 ధరను నిర్ణయించిందని, ఉచితంగా లభించే టీకాలను కూడా లెక్కిస్తే, సగటున ఒక్కో వయల్ కు రూ. 206 ధర పడుతుందని రాజేశ్ భూషణ్ తెలిపారు. సీరమ్ నుంచి 1.10 కోట్ల డోస్ లను ఒక్కోటి రూ. 200పై కేంద్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు మార్కెట్లో ఒక్కోటి రూ.1000కి విక్రయిస్తామని కూడా సీరమ్ ఇప్పటికే స్పష్టంచేసింది.
అయితే, ప్రైవేటు మార్కెట్లో టీకాను విక్రయించేందుకు భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాగా, ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. ఇండియాలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ రెండు వ్యాక్సిన్ల భద్రతపై ఎటువంటి సందేహాలు, అనుమానాలు లేవని నిర్ధారించుకున్న తరువాతనే అనుమతి ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. రెండు వ్యాక్సిన్లనూ ఎంతో పరిశీలించామని పేర్కొన్న నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, వాటి సమర్థతపై అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయని, ఇవి కరోనా వైరస్ నుంచి రక్షించేలా వ్యాధి నిరోధకతను పెంచుతాయని అన్నారు.