Maharashtra: మహారాష్ట్ర మంత్రి తనపై కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని మహిళ ఆరోపణ.. రిలేషన్‌షిప్ ఉందన్న ఎన్సీపీ నేత
- తమ రిలేషన్‌షిప్‌ను కుటుంబం కూడా అంగీకరించిందన్న మంత్రి
- ఆమె ద్వారా తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న నేత
- అత్యాచారం ఆరోపణల ఖండన
- డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని గతేడాదే ఫిర్యాదు చేశానన్న మంత్రి
తనపై వస్తున్న అత్యాచార ఆరోపణలపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే స్పందించారు. ఆ ఆరోపణలు సత్యదూరమని, ఆరోపణలు చేస్తున్న మహిళ, తాను కలసి 2003 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నామని స్పష్టం చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ధనుంజయ్ గత కొన్నేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ 38 ఏళ్ల మహిళ తాజాగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేగింది.
ఇంట్లో తాను ఒంటరిగా ఉన్న సమయంలో 2008లో తొలిసారి మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడి, దానిని వీడియో తీశారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆపై దానిని చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని, బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికిన ఆయన 2019లో పెళ్లి లేదని తెగేసి చెప్పారని ఆరోపించింది. ధనుంజయ్ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరింది.
బాధిత మహిళ ఆరోపణలపై స్పందించిన మంత్రి.. తమ మధ్య సంబంధం ఉందని అంగీకరించారు. అయితే, ఆమె ఆరోపణల్లో మాత్రం నిజం లేదన్నారు. ఆమెతో తన సంబంధాన్ని తమ కుటుంబం కూడా అంగీకరించిందని, ఆమె ద్వారా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఆమె, ఆమె సోదరి కలిసి డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని, దీనిపై గతేడాది నవంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.