USA: 70 ఏళ్లలో తొలిసారి.. అమెరికాలో మహిళకు మరణ శిక్ష అమలు
- లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు
- మానసిక స్థితి బాగాలేదన్న ఆమె తరఫు లాయర్లు
- శిక్షను జీవిత ఖైదుకు మార్చాలని విజ్ఞప్తి
- తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. శిక్ష అమలు
- గర్భిణీ హత్య కేసులో 16 ఏళ్లుగా జైలులో లీసా మోంట్ గోమెరీ
అమెరికా చరిత్రలో 70 ఏళ్లలోనే తొలిసారిగా ఓ మహిళకు మరణశిక్ష అమలు చేశారు. గర్భిణీని అతి కిరాతకంగా హత్య చేసి, గర్భస్థ శిశువును తీసుకెళ్లిపోయిన కేసులో 16 ఏళ్లుగా జైలులో ఉన్న లీసా మోంట్ గోమెరీ (52) అనే మహిళకు విషం ఇంజెక్షన్ ఎక్కించి అధికారులు శిక్ష అమలు చేశారు. ఇండియానాలోని టెర్రీ హౌతీలో ఉన్న ఫెడరల్ కరెక్షనల్ కాంప్లెక్స్ లో బుధవారం అర్ధరాత్రి దాటాక 1.31 గంటలకు ఆమెకు లెథల్ (విషపు) ఇంజెక్షన్ ఇచ్చారు.
1953 నుంచి ఇప్పటిదాకా మరణ శిక్ష పడిన ఏకైక మహిళ లీసా మోంట్ గోమెరీనే. ఆమె మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును మంగళవారం కోరారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఇన్నాళ్లూ జైలులో రక్షించాల్సిన వ్యక్తులే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు. ఆమెకు మరణ శిక్ష అమలు చేయడం అన్యాయమేనని వాదించారు. ఓ మానసిక రోగికి మరణ శిక్ష విధించాలని ప్రభుత్వం చాలా ఉత్సాహం చూపిస్తోందని ఎద్దేవా చేశారు. అయితే, లాయర్ల వాదనలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశించింది.
2004లో ఓ గర్భిణీ కడుపును కిరాతకంగా కోసి, గర్భస్థ శిశువును లీసా తీసుకెళ్లిపోయింది. శిశువు బతికినా.. గర్భిణీ చనిపోయింది. 2008లో లీసాను దోషిగా తేల్చిన మిస్సోరీ కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే, ఆ తర్వాత మరణ శిక్షను రద్దు చేసి జీవిత ఖైదు విధించాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, ఆమె తరఫు న్యాయవాదులు ట్రంప్ కు పిటిషన్ కూడా పెట్టుకున్నారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
వాస్తవానికి అమెరికాలో 1963 నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చే దాకా మరణ శిక్ష విధించిన ఉదంతాలు చాలా చాలా తక్కువ. 2020 దాకా 17 ఏళ్లలో మూడంటే మూడే మరణ శిక్షలు అమలు చేశారు. అయితే, గతేడాదే దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణ శిక్షలను మళ్లీ పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 11 మందికి శిక్ష అమలు చేశారు. ఈ వారంలోనే మరో ఇద్దరికీ అమలు చేయాల్సి ఉంది. గురువారం కోరే జాన్సన్, శుక్రవారం డస్టిన్ హిగ్స్ అనే వ్యక్తులకు మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే, వాళ్లిద్దరికీ కరోనా రావడం, ఇంకా కోలుకోకపోవడంతో ఫెడరల్ కోర్టు జడ్జి శిక్షను నిలుపుదల చేశారు.