Bandi Sanjay: కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది!: బండి సంజయ్
- బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి
- జనగామ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి
- రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు
బీజేపీ కార్యకర్తలపై పోలీసులు చేసిన లాఠీఛార్జీతో జనగామ అట్టుడుకుతోంది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామకు వెళ్లారు. జనగామ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి... పోలీసుల లాఠీఛార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు పవన్ శర్మ తదితరులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పోలీసులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని మండిపడ్డారు. లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.