Cock Fight: పోలీసుల ఆంక్షలు బేఖాతరు.. ఏపీలో జోరుగా కో'ఢీ'లు!
- ఆంక్షలున్నా ఆగని కోడి పందేలు
- ఉభయ గోదావరి జిల్లాల్లో చేతులు మారుతున్న కోట్లు
- నేడు, రేపు కూడా కొనసాగనున్న సందడి
సంక్రాంతి... ఈ పేరు చెబితేనే తెలుగురాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలే. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ఆంక్షలను ఎంత కఠినంగా అమలు చేసినా, చివరకు పందెం రాయుళ్లే గెలిచారు. దాదాపు మూడు వారాల పాటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కోడి పందేలు వద్దని, బరుల ఏర్పాటు కూడదని పోలీసులు ఎంతగా ప్రచారం చేసినా, చివరకు పందాలు ప్రారంభం అయిపోయాయి.
నిన్న భోగి రోజున మధ్యాహ్నం వరకూ అంతంతమాత్రంగా ఉన్న కోడి పందాల సందడి, ఆపై సాయంత్రానికి పుంజుకుంది. రాత్రంతా పందేలు జరిగాయి. భోగి రోజునే కోట్ల రూపాయలు చేతులు మారాయి. తమతమ సొంత గ్రామాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో స్వయంగా కోడి బరులు ఏర్పాటయ్యాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాటలు కూడా జరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలను ఆకర్షించేందుకు రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటయ్యాయి.
ఒక్కో కోడి పందెం రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ పలికింది. ఇక గ్రామాల్లో పందెం బరుల నిర్వహణపై స్థానిక నేతల మధ్య విభేదాలు తలెత్తినట్టు కూడా తెలుస్తోంది. కొన్ని చోట్ల రాజీ కుదరగా, మరికొన్ని చోట్ల వాగ్వాదాలు జరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో చాలా ప్రాంతాల్లో కోడి పందేలను నిషేధిస్తున్నామని ప్లెక్సీలను పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇదిలావుండగా, తెలంగాణ నుంచి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు కోడి పందాల్లో పాల్గొనేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు తరలివెళ్లారు. దీంతో ఏలూరు, అమలాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి తదితర పట్టణాల్లోని హోటల్స్ పూర్తిగా నిండిపోయాయి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే గత రాత్రి రూ. 20 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది.
ఇక పందేల్లో పాల్గొనే వారికి, పేకాట ఆడేవారికి అవసరమైన మద్యం, కోడి పకోడి వంటివి ఉచితంగా అందించారు. చాలా ప్రాంతాల్లో ఎవరికీ తెలియకుండా తోటల్లో పేకాట డెన్ లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే, ప్రతియేటా సంక్రాంతి సీజన్ లో అత్యంత సందడిగా ఉండే భీమవరంలో ఈ దఫా పెద్దగా సందడి కనిపించలేదని అక్కడికి వెళ్లిన వారు అంటున్నారు.