Odisha: ఒక్క విద్యార్థి కోసం బస్సు సమయాన్ని మార్చిన ఒడిశా!
- భువనేశ్వర్ లో 7వ తరగతి చదువుతున్న అన్వేష్
- బస్సు ఆలస్యంగా వస్తుండటంతో స్కూలులో చివాట్లు
- విషయం తెలుసుకుని బస్ టైమింగ్స్ సవరించిన ట్రాన్స్ పోర్ట్ ఎండీ
ఒక విద్యార్థిని చదువు నిలిచిపోరాదన్న ఉద్దేశంతో జపాన్ ప్రభుత్వం ఏకంగా ఓ రైలును నడిపించిందన్న వార్తను అందరూ వినే ఉంటారు. అటువంటిదే ఓ ఘటన ఒడిశాలో జరిగింది. నిత్యమూ ప్రజా రవాణాను వినియోగించుకుంటూ స్కూలుకు వెళుతున్న ఓ విద్యార్థి, నిత్యమూ ఆలస్యంగా వెళుతున్నాడని సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకున్న ఒడిశా క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ (సీఆర్టీయూ) ఎండీ, బస్సు సమయాన్ని మార్చారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, భువనేశ్వర్ లోని ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్ లో సాయి అన్వేష్ ప్రధాన్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుకుంటున్నాడు. అతని స్కూలు ఉదయం 7.30కి ప్రారంభం అవుతుంది. కానీ, ఎక్కాల్సిన బస్సు మాత్రం 7.40కి వస్తుంది. దీంతో నిత్యమూ స్కూల్ టీచర్లతో చివాట్లు తింటూ విలువైన క్లాసులను మిస్ అవుతున్నాడు.
ఇక, ఈ విషయాన్ని అన్వేష్ ట్విట్టర్ వేదికగా, (సీఆర్టీయూ) ఎండి అరుణ్ బోత్రాను ట్యాగ్ చేస్తూ తెలియజేశాడు. తాను నిత్యమూ పాఠశాలకు ఆలస్యం అవుతున్నానని, తన ఇబ్బందిని అర్థం చేసుకుని, స్కూలుకు సమయానికి వెళ్లేలా చూడాలని వేడుకున్నాడు. ఈ ట్వీట్ ను చూసిన బోత్రా, వెంటనే బస్ టైమింగ్ ను మార్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరుసటి రోజు నుంచే బస్సు ముందుగానే రావడం మొదలు పెట్టగా, అన్వేష్ సమయానికి స్కూలుకు చేరుకుంటున్నాడు.