BSF: సరిహద్దులో బయటపడిన మూడో సొరంగం.. పాక్ ఉగ్ర శిబిరాల నుంచి భారత్‌లోకి!

BSF detects another tunnel along India and Pakistan border
  • హీరానగర్ సెక్టార్‌లో బయటపడిన 150 మీటర్ల సొరంగం
  • పాక్‌లోని ఉగ్ర శిబిరాలు ఉండే షకీర్‌గఢ్ నుంచి తవ్విన ఉగ్రవాదులు
  • గత ఆరు నెలల్లో అధికారులు గుర్తించిన మూడో సొరంగం
భారత్, పాక్ సరిహద్దులో సొరంగాలు బయటపడుతున్నాయి. పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు తవ్విన సొరంగాలను బీఎస్ఎఫ్ గుర్తిస్తోంది. గత ఆరు నెలల్లో ఇలాంటి రెండు సొరంగాలు బయటపడగా, తాజాగా మరో దానిని గుర్తించింది. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌లోని బాబియాన్ గ్రామంలో ఇది బయటపడింది.

150 మీటర్ల పొడువున్న ఈ సొరంగం పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలు ఉండే షకీర్‌గఢ్ నుంచి తవ్వారు. ఇందులో పాకిస్థాన్ గుర్తులతో ఉన్న ఇసుక సంచులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సొరంగం ద్వారా చొరబాట్లు జరిగాయా? లేదా? అన్న విషయాన్ని దర్యాప్తు ద్వారా తేలుస్తామన్నారు.

కాగా, సాంబా జిల్లాలో గతేడాది ఆగస్టు 28న ఒకటి, నవంబరు 22న మరో సొరంగాన్ని గుర్తించారు. ఇవి రెండూ పాకిస్థాన్ భూభాగం వైపు నుంచి ఉన్నవే. ఈ సొరంగాలను ఉపయోగించుకుని దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.
BSF
Jammu And Kashmir
Tunnel
Pakistan

More Telugu News