Rahul Gandhi: జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి... తమిళ సంస్కృతిని కించపరిచే వాళ్లకు సందేశం ఇవ్వడానికే వచ్చానని వెల్లడి
- తమిళనాడులో జల్లికట్టు షురూ
- మధురై జిల్లా అవనియపురంలో పోటీలు
- ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ గాంధీ
- తమిళులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడి
తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టులో ఈసారి రాహుల్ గాంధీ సందడి చేశారు. మధురై జిల్లాలోని అవనియపురంలో ఈ ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్యాజువల్ దుస్తుల్లో జల్లికట్టు వేదికపై కనిపించిన రాహుల్ ఈ పోటీల్లో పాల్గొంటున్న వారిని ఉత్సాహపరిచారు. రాహుల్ రాకతో జల్లికట్టు ప్రాంగణంలో మరింత సందడి నెలకొంది. రాహుల్ తో చేయి కలిపేందుకు క్రీడాకారులు పోటీపడ్డారు.
ఈ సందర్భంగా రాహల్ గాంధీ మాట్లాడుతూ, అటు ఎద్దులకు, ఇటు పోటీదారులకు ఏమాత్రం ఆపద వాటిల్లని విధంగా భద్రత ఏర్పాట్లు చేశారంటూ నిర్వాహకులను అభినందించారు. భారతదేశ భవిష్యత్తుకు తమిళ సంస్కృతి, చరిత్ర ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు, తమిళులను, వారి భాషను, వారి ఘనతర వారసత్వాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారికి సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. తమిళులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని రాహుల్ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.