Bhuma Akhila Priya: అఖిలప్రియకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్
- హఫీజ్ పేట కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ
- ముగిసిన మూడు రోజుల పోలీస్ కస్టడీ
- ఇవాళ వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు
- ఆపై న్యాయమూర్తి నివాసంలో హాజరు
- ఈ నెల 16న అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణ
హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారంలో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియగా, పోలీసులు ఆమెను ఇవాళ మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
అంతకుముందు, అఖిలప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. కరోనా పరీక్షలతో పాటు, ఈసీజీ, గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగెటివ్ రాగా, ఆమెను విచారణ నిమిత్తం న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 16న విచారణ జరపనున్నారు. కాగా, హఫీజ్ పేట కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోంది.