Atchannaidu: దిగజారుడు రాజకీయాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య: అచ్చెన్నాయుడు

Jagan is expert in deteriorating politics says Atchannaidu

  • అవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారు
  • విగ్రహాలను ధ్వంసం చేయిస్తూ.. మరోవైపు పూజల్లో పాల్గొంటున్నారు
  • మతాల మధ్య మంటలు పెట్టి చలికాచుకుంటున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజలు జరిపించే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్ కి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. చివరకు ఆవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేందుకు దిగజారిపోయారని మండిపడ్డారు. ఏ మతాన్ని కూడా జగన్ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని అన్నారు. క్రిస్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలను దూరం చేశారని విమర్శించారు.

జగన్ ఓ వైపు విగ్రహాలను ధ్వంసం చేయిస్తూ, రథాలను తగులబెడుతూ... మరోవైపు పూజల్లో పాల్గొంటున్నారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయి హత్యపై కూడా జాలి చూపని జగన్... దేవుళ్లపై విశ్వాసం చూపుతాడని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేయించబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మతాల మధ్య మంట పెట్టి చలికాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి ధోరణికి జగన్ స్వస్తి పలకాలని అన్నారు. ఆలయాలపై తొలి దాడి జరిగినప్పుడే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామని... అయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆలయాలపై దాడి చేసిన వారిని పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం మన రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News