Naravane: చైనాకు దీటుగా సమాధానమిచ్చాం: ఆర్మీ చీఫ్ నరవాణే
- గాల్వాన్ లోయలో మన వీరులు ప్రాణ త్యాగాలు చేశారు
- గత ఏడాది 200కు పైగా టెర్రరిస్టులను మట్టుపెట్టాం
- సరిహద్దుల్లోని క్యాంపుల్లో 300 నుంచి 400 వరకు టెర్రరిస్టులు ఉన్నారు
భారత్-చైనాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మన సైన్యం చాలా కఠినంగా వ్యవహరించిందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తెలిపారు. మన భూభాగాన్ని రక్షించుకునే క్రమంలో చైనాకు దీటుగా సమాధానమిచ్చామని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఆర్మీ డే పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదంతా మన సైనికులు ఎన్నో ఛాలెంజ్ లను ఎదుర్కొన్నారని... ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు.
గాల్వాన్ లోయ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతల గురించి నరవాణే మాట్లాడుతూ, డ్రాగాన్ బలగాలను నిలువరించే క్రమంలో మన వీరులు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. పొరుగుదేశ కుట్రలకు మన బలగాలు దీటుగా సమాధానమిచ్చాయని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను వృథా పోనివ్వబోమని చెప్పారు. తమ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయవద్దని ఇదే సమయంలో శత్రువులను హెచ్చరించారు.
పాకిస్థాన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, టెర్రరిస్టులకు పొరుగు దేశం స్వర్గధామంలా మారిందని దుయ్యబట్టారు. పాకిస్థాన్ కాల్పుల విరమణకు తూట్లు పొడవటం 44 శాతం పెరిగిందని చెప్పారు. గత ఏడాది క్రాస్ బోర్డర్ ఆపరేషన్లలో 200కు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టామని తెలిపారు. సరిహద్దుల్లోని ట్రైనింగ్ క్యాంపుల్లో 300 నుంచి 400 వరకు టెర్రరిస్టులు ఉన్నారని... భారత భూభాగంలోకి చొరబడేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారని చెప్పారు.