Rahul Gandhi: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం పట్ల గర్విస్తున్నా: రాహుల్ గాంధీ
- 50 రోజులుగా రైతుల నిరసనలు
- రైతులకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం ఎదుట నిరసన
- పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక
- వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దాదాపు 50 రోజులకు పైగా ఉద్యమం సాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. తాజాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులకు సంఘీభావంగా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం పట్ల గర్విస్తున్నానని అన్నారు. రైతులకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రైతులను కాపాడేందుకు కాంగ్రెస్ ఎంతవరకైనా వెళుతుందని, ఈ పోరాటంలో తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. గతంలో మోదీ సర్కారు రైతుల నుంచి భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తుచేశారు. ఇకనైనా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలతో రైతులకు మేలు జరగకపోగా, మరింత నష్టం కలుగుతుందని అన్నారు.