Britain actor: తాను చనిపోయాక మృతదేహాన్ని జూలోని సింహాలకు ఆహారంగా వేయాలన్న నటుడు.. అక్కర్లేదు డబ్బులిస్తే చాలన్న జూ పార్క్!
- ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రిటిష్ నటుడు రికీ జెర్వీన్
- తన మృతదేహాన్ని సింహాలు పీక్కుతింటుంటే చూడాలని ఉందన్న నటుడు
- తన శరీరం ఇలాగైనా ఉపయోగపడితే అదే సంతోషమన్న రికీ
తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని లండన్ జూలోని సింహాలకు ఆహారంగా వేయాలన్న బ్రిటన్ హాస్య నటుడు, నిర్మాత, దర్శకుడు రికీ జెర్వీన్ వ్యాఖ్యలపై లండన్ జూపార్క్ స్పందించింది. రికీని తినడానికి తమ జూలోని సింహాలకు కష్టంగా ఉండొచ్చని సరదాగా వ్యాఖ్యానించింది. ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే విరాళాల రూపంలో ఇవ్వాలని, ఆ సొమ్ముతో ఆహారం కొనుగోలు చేసి సింహాలకు వేస్తామని జూ నిర్వహణాధికారి తెలిపారు.
జూ స్పందన వెనక ఉన్న కారణం ఏంటంటే.. ఇటీవల ఓ చానల్‌కు రికీ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో చానల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మీరు చనిపోయిన తర్వాత మీ మృతదేహాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించాడు. దీనికి రికీ స్పందిస్తూ.. తన శరీరాన్ని లండన్ జూలోని సింహాలకు ఆహారంగా వేయాలని కోరుతున్నట్టు చెప్పుకొచ్చాడు. తన మరణానంతరం శరీరం ఇలాగైనా ఉపయోగపడుతున్నందుకు సంతోషపడతానని పేర్కొన్నాడు.
ప్రపంచం నుంచి మనం ఎన్నింటినో తీసుకుంటున్నామని, స్వేచ్ఛగా తిరిగే జంతువులను చంపి తినేస్తున్నామని, అడవులను నరికేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. అన్నింటినీ నాశనం చేస్తున్న మనం తిరిగి వాటి కోసం ఏమీ చేయడం లేదని, కాబట్టి తాను చనిపోయిన తర్వాత సింహాలకు ఆహారంగా మారాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తన మృతదేహాన్ని సింహాలు పీక్కు తింటుంటే అప్పుడు సందర్శకుల ముఖాల్లోని భావాలని చూడాలని ఉందన్నాడు. తాజాగా, రికీ వ్యాఖ్యలపై స్పందించిన జూ యాజమాన్యం అలా స్పందించింది.