vaccine: గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్
- దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
- తెలంగాణలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- కరోనా వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఈటల
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు కేంద్రాల్లోనూ పలువురికి వ్యాక్సిన్ వేశారు. గాంధీ ఆసుపత్రిలో కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు వేశారు.
అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ప్రతి కేంద్రంలో ముందుగా ఎంపిక చేసిన 30 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. వైరస్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మోదీ ఈ రోజు చేసిన ప్రసంగంలో గుర్తు చేశారని ఈటల చెప్పారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారని అన్నారు.
కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించి, కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ముందుగా వ్యాక్సిన్లు ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఆ ఆదేశాల ప్రకారమే తెలంగాణలో వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపారు. కనపడని వైరస్ కు వ్యాక్సిన్ ద్వారా చరమగీతం పాడుతున్నామని తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే స్థాయిలో మనం ఉన్నామని అన్నారు.