Russia: రష్యా ఎస్400 క్షిపణులపై అమెరికాతో భారత్ సై అంటే సై!
- ఒప్పందం రద్దు చేసుకోకపోతే ఆంక్షలు తప్పవని అమెరికా బెదిరింపులు
- భవిష్యత్ ఆయుధ కొనుగోళ్లపైనా ప్రభావం పడుతుందని వార్నింగ్
- దీటుగా బదులిచ్చిన భారత్.. ఏ దేశం నుంచైనా కొనే హక్కుందని వెల్లడి
- విదేశాంగ విధానాల్లో తమకు స్వతంత్రత ఉందని తేల్చి చెప్పిన భారత్
అమెరికాతో సై అంటే సై అంటోంది భారత్. ఎస్400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ చేసుకున్న ఒప్పందంపై అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ కూడా అదే స్థాయిలో దీటుగా బదులిస్తోంది.
రష్యాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే మిగతా అన్ని దేశాల్లాగే భారత్ పైనా ఆంక్షలు పెడతామని అమెరికా బెదిరింపులకు దిగుతోంది. ఈ విషయంలో భారత్ కు ఎలాంటి మినహాయింపులు ఉండబోవంటోంది. దౌత్య సంబంధాల విషయంలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. బైడెన్ అధికారం చేపట్టాక కూడా అమెరికా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రష్యా విషయంలో మరింత కఠినంగా ఉంటామని బైడెన్ ఇప్పటికే చెప్పడంతో పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని అంటున్నాయి.
అయితే, ఈ విషయంలో భారత్ కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. చైనాతో ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకు తమకు ఈ మిసైల్స్ చాలా కీలకమని అమెరికాకు వివరించింది. అయినా కూడా అమెరికా వినట్లేదు. దీంతో ప్రపంచంలో ఎవరి దగ్గరి నుంచైనా ఆయుధాలు కొనుగోలు చేసే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.
‘‘అమెరికాతో భారత్ కు సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అదే సమయంలో రష్యాతోనూ ప్రత్యేకంగా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మాకు హక్కు ఉంది’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. విదేశాంగ విధానాల్లో తమకంటూ స్వతంత్రత ఉందని చెప్పారు. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఆయధ కొనుగోళ్లు, సరఫరా విషయంలోనూ అది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిందన్న కారణంగా గతేడాది డిసెంబర్ లో టర్కీపై కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ– క్యాట్సా) కింద అమెరికా ఆంక్షలు విధించింది. ఇండియా విషయంలోనూ అది వర్తిస్తుందని అమెరికా ఎంబసీ అధికారి అన్నారు.
‘‘రష్యాతో ఒప్పందాలు చేసుకుంటే క్యాట్సా కింద ఆంక్షలు తప్పవని మా భాగస్వాములు గుర్తుంచుకోవాలి. ఆంక్షల విషయంలో ఏ దేశానికీ క్యాట్సాలో ప్రత్యేక మినహాయింపులేవీ లేవు’’ అని చెప్పారు. ఇండియా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దీనిపై ప్రస్తుతానికి రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
అమెరికాతో ఆయుధ కొనుగోళ్ల పరిస్థితేంటి?
భారత్ ఐదు ఎస్400 క్షిపణుల కొనుగోలు కోసం రష్యాతో 550 కోట్ల డాలర్లతో (సుమారు రూ.40,238 కోట్లు) ఒప్పందం చేసుకుంది. 2019లోనే భారత్ 80 కోట్ల డాలర్లు (సుమారు రూ.5,852 కోట్లు) తొలి విడత చెల్లింపులు చేసింది. అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడతలో క్షిపణి బ్యాటరీలు భారత్ కు రష్యా అందించనుంది. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ఇండియాకు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా రష్యా ఉంది. యుద్ధ విమానాలు మొదలుకుని మిలటరీ టెక్నాలజీ దాకా సమకూరుస్తోంది.
అయితే, ఇటీవలి కాలంలో అధునాతన విమానాలు, డ్రోన్ల కోసం అమెరికా, ఇజ్రాయెల్ తోనూ భారత్ ఒప్పందాలు చేసుకుంది. దీంతో ఇప్పుడు రష్యా నుంచి క్షిపణులు కొంటే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేసింది.
రష్యా ఆయుధాలు కొంటే మిలటరీ పరికరాల కొనుగోలుపై తమతో చేసుకున్న ఒప్పందాలకు దెబ్బ పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో అత్యాధునిక యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్ల కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకునే అవకాశముందని పేర్కొంది. కాబట్టి వీటన్నింటినీ తప్పించుకోవాలంటే రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవాలని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిపుణుడు రిచర్డ్ రొస్సో అన్నారు.