Etela Rajender: ఈరోజు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్
- డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనాపై యుద్ధం చేస్తున్నారు
- ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా అర్పించారు
- అందుకే తొలి వ్యాక్సిన్ కర్మచారి కృష్ణమ్మకు ఇచ్చాం
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నేడు ఇండియాలో ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానంటూ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకు ఇచ్చారు.
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను తొలి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో ఈటల తెలిపారు. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేస్తున్నారని... ప్రాణ త్యాగాలు కూడా చేశారని చెప్పారు.
అందుకే, వారికే ముందు వ్యాక్సిన్ వేయాలని ప్రధాని మోదీ కూడా సూచించారని... అందుకు కర్మచారి కృష్ణమ్మకే తొలి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. అందుకే తాను ఈరోజు వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. యావత్ ప్రపంచానికి మన దేశం వ్యాక్సిన్ అందిస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.