KTR: ప్రధాని సూచనల మేరకు తొలి విడతలో మేం టీకాలు వేయించుకోవడంలేదు: కేటీఆర్
- దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
- తెలంగాణలోనూ టీకాల సందోహం
- తిలక్ నగర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేటీఆర్
- ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలి ప్రాధాన్యత
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సందడి నెలకొంది. తెలంగాణలోనూ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దీనిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మొదటి విడత వ్యాక్సినేషన్ లో ప్రజాప్రతినిధులు టీకాలు వేయించుకోవడం లేదని వెల్లడించారు.
కరోనాపై ముందుండి పోరాడిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. టీకా తీసుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నా, ప్రధాని సూచనలు పాటించాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే తాము కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటామని పేర్కొన్నారు. తిలక్ నగర్ లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్లు ఎంతో సురక్షితమైనవని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.