Chandrababu: సజ్జల స్క్రిప్టు, జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు

Chandrababu says DGP acts under Sajjala script and Jagan direction

  • ఏపీలో ఆలయాలపై దాడుల ఘటనల్లో డీజీపీ వ్యాఖ్యలు
  • మండిపడుతున్న విపక్షాలు
  • 150 దాడులు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారన్న చంద్రబాబు
  • కనుమ రోజు వచ్చేసరికి డీజీపీ మాట మార్చారని ఆరోపణ
  • వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? అంటూ ఆగ్రహం

ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర డీజీపీ మాట మార్చారంటూ గౌతమ్ సవాంగ్ పై విపక్షాలు ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డీజీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సజ్జల స్క్రిప్టు, జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.

"ఆలయాలపై 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారు. దాడులకు, రాజకీయాలకు సంబంధం లేదని... అది ఉన్మాదులు, పిచ్చివాళ్ల పని అని భోగి రోజున డీజీపీ అన్నారు. కానీ కనుమ రోజుకు వచ్చేసరికి డీజీపీ మాట మార్చారు. దాడుల ఘటనలను ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు" అని విమర్శించారు.

ఆలయాలపై దాడులు చేసిన వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడిపై భక్తితో దాడుల సమాచారాన్ని బయటపెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తారా? విధ్వంసాలకు పాల్పడిన వైసీపీ వాళ్లపై కేసులు లేవా? అని నిలదీశారు. అన్యమత ప్రచారాలు, బలవంతపు మతమార్పిళ్లు చేస్తోందెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ దుర్మార్గాలపై ప్రజా తీర్పుకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్ష వంటిదని చంద్రబాబు అభివర్ణించారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు ఇదొక అవకాశం అని తెలిపారు. వైసీపీ ఓటమి ద్వారా చారిత్రాత్మక తీర్పుకు తిరుపతి వేదిక కావాలని, తిరుపతి ప్రజలు దేశానికే ఒక సందేశాన్ని పంపాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News