Anil Kumar Yadav: ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం టీడీపీకి పట్టుకుంది!: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు మాత్రమే తెలుసు
- ఇప్పుడు నారా వారి నరాల్లో వణుకు పుడుతోంది
- దేవుడితో ఆడుకున్న వారు బాగుపడినట్టు చరిత్రలో లేదు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే తెలుసని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేవాలయాలపై, హిందూ విగ్రహాలపై జరుగుతున్న దాడుల గురించి డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరంగా చెప్పారని... దీంతో, వారి హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం టీడీపీలో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తిపోయారని, గుంపులుగుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నిజాలు బయటకు రాకూడదని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని విమర్శించారు.
భూమా అఖిలప్రియ కేసుల గురించి మాట్లాడని చంద్రబాబు... ఏపీలోని 9 కేసుల గురించి మాట్లాడుతున్నారని అనిల్ దుయ్యబట్టారు. ఈ 9 కేసుల్లో ఉన్నవారు మీవాళ్లు కాదా? కాదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అన్ని కేసుల్లో మీ ప్రమేయం ఉందని చెప్పడం లేదని... కొన్ని కేసుల్లో మాత్రమే మీ పాత్ర ఉందని చెపుతున్నామని అన్నారు.
తాము అనుకుంటే నారా లోకేశ్ మీద కేసు పెట్టలేమా? అని అడిగారు. పలు ఘటనలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు. రాజమండ్రిలో వినాయక విగ్రహాన్ని అపవిత్రం చేసింది బుచ్చయ్య చౌదరి అనుచరులు కాదా? అని అడిగారు. తిత్లీ తుపానులో విగ్రహం దెబ్బతింటే... దానిపై దుష్ప్రచారం చేసింది బీజేపీ నేత కాదా? అని ప్రశ్నించారు.
విగ్రహాల ధ్వంసం కేసుల్లో వాస్తవాలు బయటపడుతుంటే నారావారి నరాల్లో వణుకు పుడుతోందని అనిల్ ఎద్దేవా చేశారు. దేవుడితో ఆడుకున్న వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో జరిగినా బయటకు రాని చంద్రబాబు... రాముడి విగ్రహం అనగానే పరిగెత్తుకొచ్చారని విమర్శించారు. రాముడి విగ్రహం ధ్వంసం వెనుక ఏదో కుట్ర ఉందని... దీని గురించి చంద్రబాబుకు ముందే తెలుసని అన్నారు. చంద్రబాబుకు ఆయన సొంత వర్గం మీద తప్ప మరెవరిమీద ప్రేమ లేదని దుయ్యబట్టారు.