Vundavalli Sridevi: ఆరోగ్య సిబ్బందికి స్వయంగా కరోనా టీకా వేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ షురూ
- తన నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ ను పర్యవేక్షించిన శ్రీదేవి
- పొన్నెకల్లు, నుదురుపాడులో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసిన వైనం
- ఓ డాక్టర్ గా సంతోషిస్తున్నానని వెల్లడి
ఇవాళ ఏపీలోనూ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా టీకాల కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన తాడికొండ నియోజకవర్గంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె పొన్నెకల్లు, నుదురుపాడు పీహెచ్ సీలను సందర్శించి వ్యాక్సిన్లు ఇస్తున్న తీరును పరిశీలించారు. అంతేకాదు, అక్కడి ఆరోగ్య సిబ్బందికి స్వయంగా కరోనా వ్యాక్సిన్ వేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఇక టీకాలు వేయడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందిస్తూ, తొలిదశలో ఆరోగ్య సిబ్బందికి తన చేతుల మీదుగా వ్యాక్సిన్ వేయడం ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, ఓ డాక్టర్ గా ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండదని వెల్లడించారు. లేనిపోని అపోహలు వద్దని స్పష్టం చేశారు.